డాక్టర్ అరిపిరాల కృషి  అమోఘం … అద్భుతం 

 తెలుగు వెలుగు వ్యాస మంజూష పరిచయ సభలో వక్తల కితాబు  
aripirala (2)aripirala (1)
   నరసాపురం వైఎన్ కళాశాల  విశ్రాంత ఆచార్యులు  డాక్టర్ అరిపిరాల నారాయణరావు సారధ్యంలో 1985నుంచి నిర్వహించిన తెలుగు వెలుగు కార్యక్రమాలకు సంబంధించిన ప్రసంగాలను ఆడియోలలో భద్రపరిచి వాటికి అక్షర రూపం కల్పిస్తూ   వెయ్యి పేజీలతో రూపొందించిన ‘తెలుగు వెలుగు వ్యాస మంజూష’ పుస్తకం కోసం పడిన శ్రమ అమోఘమని, మంచి ప్రయత్నం చేసి భవిష్యత్ తరాలకు ఓ మంచి గ్రంధాన్ని అందించారని పలువురు వక్తలు కొనియాడారు. తెలుగు వెలుగు వ్యాస మంజూష  పుస్తక పరిచయ సభ సుహృన్మండలి ఆధ్వర్యాన రాజమండ్రి ఏ.వి. అప్పారావు రోడ్డులోని దాట్ల సుభద్రాయమ్మ కళాంగణంలో నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ దాదాపు మూడు గంటలకు. పైగా సాగిన ఈ సభకు సూర్య సాయంకాలం పత్రిక ఎడిటర్,సీనియర్ పాత్రికేయులు శ్రీ  వి ఎస్ ఎస్ కృష్ణకుమార్ స్వాగతం పలికి, వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డాక్టర్ బిసి రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి అధ్యక్షత వహిస్తూ, డాక్టర్ అరిపిరాల వారు తెలుగు వెలుగు పుస్తకం తీసుకురావడానికి చేసిన కృషి అద్వితీయమన్నారు.  మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి నిర్దేశం చేస్తూ,మంచి మిత్రుల కలయికే సుహృన్మండలిగా పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి పోస్టులు ఉండవని, సహృదయులందరూ సభ్యులేననని చెప్పారు. మన ఊరికి చెందిన మిత్రులు డాక్టర్ అరిపిరాల నరసాపురం కాలేజీలో పనిచేసేటప్పుడు తెలుగు వెలుగు పేరిట చేసిన సభలు నభూతో  నభవిష్యత్ గా సాగాయని,వాటన్నింటినీ క్రోడీకరించి పుస్తక రూపంలో తీసుకొచ్చి, నర్సాపురంలోనే ఆవిష్కరించారని, అయితే మనూరి మనిషిగా మనం కూడా గౌరవించుకోవాలన్న ఉద్దేశ్యంతో పరిచయ సభ పేరిట కార్యక్రమం ఏర్పాటుచేశామని ఆయన వివరించారు. 
     నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ డాక్టర్ కె ఎస్ రమేష్  గ్రంథ పరిచయం చేస్తూ, డాక్టర్ అరిపిరాల వారి నేతృత్వంలో ఆనాడు తెలుగు వెలుగు సభల్లో పాల్గొన్నామని,ఇప్పుడు గ్రంథ పరిచయం చేసే అదృష్టం దక్కిందని పేర్కొన్నారు. వైఎన్ కళాశాలకు నాక్ గుర్తింపు రావడానికి తెలుగు డిపార్ట్ మెంట్ ప్రధాన కారణమని ఆయన చెబుతూ  వెలుగు సభల ఉపన్యాసాలను సిడీలలో భద్రపరచడాన్ని నాక్ బృందం ఓ ప్రత్యేక అంశంగా పేర్కొందని ఆయన చెప్పారు.   సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆత్మీయ అతిధిగా హాజరై మాట్లాడుతూ, తెలుగు భాషకు విలువ లేకుండా పోతున్న సమయంలో మాతృ భాష పట్ల అనురక్తి, అభిమానం కల్పించడానికి ఇలాంటి పుస్తకాలు దోహదపడతాయన్నారు. ప్రజల్లో అవగాహన, ప్రకటనల ప్రభావమో ఏమోగానీ మాతృ భాషలో చదువుకుంటే ప్రయోజనం లేదనే దుస్థితి నెలకొందన్నారు. నిజానికి మాతృ భాషలో పరిణతి సాధిస్తేనే, ఏ రంగంలోనైనా రాణించవచ్చని ఆయన స్పష్టంచేశారు. మన చరిత్రకు సంబంధించి డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోవడం కూడా పెద్దలోటని ఆయన చెబుతూ డాక్టర్ అరిపిరాల చేస్తున్న కృషిని కొనియాడారు. శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంధాలయంలో పుస్తకాల డిజిలైజేషన్ లో డాక్టర్ అరిపిరాల ఉదయం నుంచి రాత్రి వరకూ  పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదన్నారు. 
   డాక్టర్ అరిపిరాల స్పందన తెలియజేస్తూ   నరసాపురం వైఎన్ కళాశాల లో  కరస్పాండెంట్ డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ రావు ప్రోత్సాహంతో తెలుగు వెలుగు సభలను తిరునాళ్ల మాదిరిగా జరిపించగలగామని, మొదట్లో సీనియర్లు వ్యతిరేకించినా ,ఆతర్వాత ఒక్కొక్కరూ అందులో మమేకమై, పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు. వీరేశలింగం ఆత్మకథను పునర్ముద్రణ చేయాలనే కోరికను వ్యక్తపరిచిన సందర్భంలో సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ అందుకు అవసరమైన పేపర్ ఇస్తానని ప్రకటించారని, చకచకా ఆ కార్యక్రమం పూర్తయిందని చెప్పారు. గౌతమీ లైబ్రెరీ అభివృద్ధిలో భాగంగా నూతన భవనాలకు నిధులు మంజూరు చేయించడంతో పాటు పుస్తకాల డిజిటలైజేషన్ కి అడిగిందే తడవుగా అన్ని ఏర్పాట్లకు పూర్తిస్థాయి సహకారం అందిస్తున్నారని ఆయన చెప్పారు. నరసాపురంలో డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ రావు ఏవిధంగా  ప్రోత్సాహం ఇచ్చారో, ఇక్కడ డాక్టర్ ఆకుల సత్యనారాయణ కూడా అలాగే ప్రోత్సాహం అందిస్తున్నారని ఇది పూర్వ జన్మ సుకృతమని ఆయన చెప్పారు. 
    మాజీ ఎమ్మెల్యే శ్రీ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ఆంధ్రకేసరి యువజన సమితి లో పనిచేయడంవలన డాక్టర్ అరిపిరాలతో సంబంధం కొనసాగుతోందని, నరసాపురం లో తెలుగు వెలుగు సభలు జరిపి వాటిని పుస్తకరూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు.  మాజీ ఎమ్మెల్సీ శ్రీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ ఊరికి చెందిన  డాక్టర్ అరిపిరాల తెలుగు వెలుగు పేరిట నర్సాపురంలో సభలు చేయడం, వాటిని పుస్తక రూపం కల్పించడం అభినందనీయమన్నారు. తెలుగు వెలుగు అంటేనే మనస్సు పులకిస్తుందన్నారు. తెలుగుకి అంతగా ప్రాధ్యాన్యత లేకపోవడం గురించి గతంలో తాను శాసనమండలిలో ప్రస్తావించానని ఆయన గుర్తుచేశారు. సుహృన్మండలి చేపట్టే కార్యక్రమాల్లో తనను కూడా భాగస్వామ్యం చేసుకోవాలని ఆయన కోరుతూ  తనవంతు వ్యక్తిగత సాయం అందించే అవకాశం కల్పించాలన్నారు. సాహితీ వేత్త,గాయకుడూ శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు వెలుగు సభల సందర్బంగా నన్నయ్య భారత రచన నాటకంలో పాత్రధారిగా తానూ వున్నానని గుర్తుచేసుకున్నారు. పఠన యోగ్యతగల పుస్తకం తెలుగువెలుగు పుస్తకమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ పివి మురళీకృష్ణ మాట్లాడుతూ, తానూ మాట్లాడిన ఆడియో చూసి, అక్షరూపం కల్పించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చిందని, అలాంటిది 85వ్యాసాలకు అక్షర రూపం కల్పించిన డాక్టర్ అరిపిరాల కృషి అద్వితీయమని పేర్కొన్నారు.
   ఆదాయపు పన్ను విశ్రాంత అధికారి శ్రీ  ఓలేటి రామావతారం మాట్లాడుతూ డాక్టర్ అరిపిరాల శైలి అద్వితీయమన్నారు.శ్రీ  సి.బి.వీ.ఆర్కే శర్మ మాట్లాడుతూ తెలుగు వెలుగు పుస్తకాన్ని పలు కోణాల్లో చూపగలగడం డాక్టర్ అరిపిరాల గొప్పతనమన్నారు. ఆడియో చూసి అక్షర బద్ధం చేసిన తీరు అద్వితీయమన్నారు. శ్రీ  రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ అరిపిరాల ఈ పుస్తకం తీసుకురావడానికి శ్రమించిన తీరు చెప్పలేనిదన్నారు. మహీధర రామశాస్త్రి మాట్లాడుతూ ఈ పుస్తకంలో ముఖ్యంగా చేమకూర వేంకటకవి మీద రాసిన వ్యాసం అద్భుతమన్నారు.  డాక్టర్ అరిపిరాలపై చిరువోలు విజయ నరసింహారావు పద్యాలూ సమర్పించారు. శ్రీ జోరా శర్మ , వర్తక ప్రముఖులు శ్రీ  అశోక్ కుమార్ జైన్,శ్రీ  గ్రంధి రామచంద్రరావు,కార్పొరేటర్ కోసూరి చండీప్రియ,మాజీ కార్పొరేటర్ గూడూరి రాధిక తదితరులు మాట్లాడారు. 
 డాక్టర్ అరిపిరాల దంపతులను ఈ సందర్బంగా డాక్టర్ ఆకుల సత్యనారాయణ,శ్రీ రౌతు సూర్య ప్రకాశరావు,శ్రీ కందుల దుర్గేష్ , డాక్టర్ రామారెడ్డి తదితరుల చేతులమీదుగా ఘనంగా సత్కరించి, మెమొంటో అందించారు. చిలమర్తి ఫౌండేషన్ పక్షాన శ్రీ  పెరుమాళ్ళ రఘునాధ్,జానకి దంపతులు, అలాగే  వీరేశలింగం పురమందిరం అధ్యక్షులు మద్దూరి శివ సుబ్బారావు సత్కరించారు. పలువురు పూలమాలతో సత్కరించారు. గౌతమీ లైబ్రెరీ లిబ్రేరియన్ శ్రీ  వెంకట్రావు, సర్వశ్రీ వెంపాటి విశ్వనాధం, పెమ్మరాజు గోపాలకృష్ణ, ఎవివిఎస్ కామరాజు, పివిఎస్ కృష్ణారావు, ప్రసాదుల హరినాధ్,దినవహి బాపిరాజు, ఎస్పీ గంగిరెడ్డి, డాక్టర్ పీఎస్ రవికుమార్,ఎర్రాప్రగడ ప్రసాద్, నాళం పద్మశ్రీ,జెవిఎస్పి పూర్ణానందరావు,నల్లగొండ రవిప్రకాష్,మైదవోలు హర విజయకుమార్ దంపతులు,  ఫణి నాగేశ్వరరావు,ఎన్.ఆర్. సుబ్రహ్మణ్యం,ప్రయాగ సుబ్రహ్మణ్యం, నిమ్మలపూడి వీర్రాజు,ఎం నాగేశ్వరరావు, లక్కోజు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. 
  

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.