పూజిద్దాం గణపతిని ప్రకృతి సహజంగా…!

ganapati

పల్లవి:

పూజిద్దాం గణపతిని ప్రకృతి సహజంగా…!

సేవిద్దాం గజముఖుని భక్తిపూర్వకంగా…!

మాలిన్యం అంటనట్టి మట్టి ప్రతిమతో,

కాలుష్యం సోకనట్టి భక్తి, శ్రద్ధతో…!

చరణం-1:

ఆకుపత్రి పూజలనే కోరుకొనే స్వామికి

రేకుముక్కలతొ విగ్రహ నిర్మాణాలా?

మోదకాలు కోరుకునే మూషికవాహనునికి

రంగులు, రసాయనాల నైవేద్యాలా?

మట్టివిగ్రహాలనే ప్రతిష్ఠ చేద్దాం…!

మామిడాకు తోరణాల స్వాగతమిద్దాం…!

చరణం-2:

ఓంకార నాదాలే కోరుకొనే స్వామికి,

భీకర శబ్దాల సినీ సంగీతాలా…?

ఆధ్యాత్మిక పరిమళాలు ఆశించే స్వామికి…

అశ్లీలపు నృత్యాలతొ ఆరాధనలా…?

భక్తి భావనను పెంచే భజనలు చేద్దాం….!

సంప్రదాయ రీతిలోనే సందడి చేద్దాం…!

చరణం-3:

ప్రకృతిలో మమేకమై పరవశించు స్వామికి

వికృతమైనట్టి వేషధారణలేల?

పవిత్ర గంగాభిషేకమందుకొనే స్వామికి

కలుషిత కాసారములనిమజ్జనమేల?

పవిత్రమగు భావనతో ఊరేగిద్దాం…!

పరవశించు రీతిగా నిమజ్జనం చేద్దాం…!

Noojilla Srinivas-photo

రచన: నూజిళ్ళ శ్రీనివాస్, ఆంగ్లోపన్యాసకులు,

ప్రభుత్వ (అటానమస్) కళాశాల, రాజమండ్రి.

సెల్: 94408 36041; email: noojillasrinivas@gmail.com

About The Author

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.