భవానీపురంలో సంపత్ వినాయకుడు – Sampath vinayaka temple at bhavanipuram

కోరిన కోర్కెలు తీరుస్తూ .. అలరారుతున్న ..
భవానీపురంలోని సంపత్ వినాయకుడు
WP_20160704_002

వినాయకుడి గుళ్ళు చాలా చోట్ల వున్నాయి. అసలు వినాయకుని గుడి లేని ప్రాంతం చాలా మటుకు కనపడదు. పైగా కాణీపాకం, అయినవిల్లి వంటి చోట్ల వినాయకుని ఆలయాలకు వున్న చరిత్ర, భక్తులకు వున్న నమ్మకం అంతా ఇంతా కాదు. అయితే రాజమహేంద్రవరానికి అతి దగ్గరలో భవానీ పురంలో కొలువైన శ్రీ సంపత్ వినాయకుని పేరు చెబితే చాలామంది భక్తులకు పులకింత వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొలువైన వినాయకుణ్ణి దర్శించి , తమ కోరికలు నెరవేరిన వాళ్ళు ఎందరో వున్నారని చెప్పక తప్పదు. ఉన్నత చదువుల కోసం ప్రయత్నం కావచ్చు , ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, సంతాన యోగం కావచ్చు , పెళ్లి ప్రయత్నాలు కావచ్చు, ఏదైనా సరే, కోరుకున్నది తడవుగా నెరవేరుస్తాడని చాలామంది భక్తుల నమ్మకం. ఇప్పటికే చాలామంది ఈ ఆలయ మహిమ తెలుసుకుని, దర్శించి తమ కోరికలు నెరవేరడంతో పలుసార్లు ఇక్కడకు వస్తున్నారు.
ఇంతటి మహిమ గల భవానీపురం శ్రీ సంపత్ వినాయకుని ఆలయాన్ని సరిగ్గా 10 ఏళ్ల క్రితం శ్రీ రెబ్బాప్రగడ వెంకట సూర్యారావు దాతల సహకారంతో నిర్మించారు. వెదురుపాక శ్రీ విజయ దుర్గా పీఠాధిపతులు శ్రీ గాడ్ ఆశీస్సులతో వ్యయనామ సంవత్సర జేష్ఠ శుద్ధ ఏకాదశి బుధవారం చిత్తా నక్షత్ర మిధున లగ్నం (2006 జూన్ 7వ తేదీ) ఉదయం 7.45గంటలకు శాస్త్రోక్తంగా ఇక్కడ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. ఆగమాచార్య , రాజగురు డాక్టర్ ఎం ఆర్ వి శర్మ ఆధ్వర్యాన శ్రీ పుట్రేవు సూర్య వెంకట్రావు శ్రీమతి రాధా కామేశ్వరి దంపతులచే వైభవంగా ప్రతిష్ఠా మహోత్సవం జరిపించారు.
కొంతమూరు వెళ్లే దారిలో శానిటోరియం పక్కన సంతోష్ నగర్ దాటాక భవాని పురం ఉంది. రెండు దశాబ్దాల క్రితం ఇక్కడ కేవలం మూడు ఇళ్ళు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వందలాది ఇళ్ళు వచ్చేసాయి . రాజమహేంద్రవరం కేంద్ర సహకార బాంక్ (డిసిసిబి బ్రాంచ్) లో మేనేజర్ గా పనిచేసి రిటైరైన శ్రీ రెబ్బాప్రగడ వెంకట సూర్యారావు భవానీపురం ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు. రాజానగరం మండలం శ్రీకృష్ణ పట్నం సర్పంచ్ గా చాలా ఏళ్ళు పనిచేసిన స్వర్గీయ రెబ్బాప్రగడ రామబ్రహ్మం రెండవ కుమారుడైన శ్రీ సూర్యారావు ఇక్కడ దాతల సాయంతో సంపత్ వినాయకుని గుడి నిర్మించడమేకాక నిర్వహణా భారం మోస్తూ వస్తున్నారు. నాగమ్మ తల్లి ఉపాలయం కూడా ఇక్కడ నిర్మించారు. ఇక్కడ నిత్య పూజలు, ప్రతియేటా వార్షికోత్సవం, గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాలనుంచి భక్తులు వచ్చి చండీహోమం, గణపతి హోమం తదితర క్రతువులు నిర్వహించుకుంటుంటారు.
దాతలు ఇంకా ముందుకొచ్చి , సాయం అందిస్తే, నిత్యం ధూప దీప నైవేద్యాలు నిరంతరాయంగా జరగడానికి వీలవుతుందని అందుచేత భక్తులు సహకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. వివరాలకు శ్రీ ఆర్ వి సూర్యారావుని 9866031379 నెంబర్ లో సంప్రదించవచ్చు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.