యోగ సాధనతో మోక్షం :ప్రొ. రాఘవేంద్రన్

sadguru

భక్తి కన్నా యోగ సాధన ద్వారా మోక్షం సులభంగా పొందవచ్చని సద్గురు శివానంద శిష్యులు ప్రొఫెసర్ రాఘవేంద్రన్ అన్నారు. రాజమహేంద్రవరం దానవాయిపేట వాడ్రేవు బిల్డింగ్స్ లో సద్గురు శివానంద సత్సంగంలో భాగంగా గురువారం ఉదయం యోగ సాధన గురించి డాక్టర్ రాఘవేంద్రన్ వివరించారు. భక్తిమార్గానికి గురువుతో పని లేదని , యోగ మార్గానికి గురువు తప్పనిసరి అని ఆయన అన్నారు. చాలామంది ఈవన్నీ భరించాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలో , ఎన్ని కర్మలు చేయాలో, ఇక మోక్షం ఎప్పుడో అనుకుంటారని , అయితే యోగ మార్గం ద్వారా కేవలం ఒక జన్మలో నే కష్టాల నుంచి గట్టెక్కి, మోక్షం పొందవచ్చని ఆయన అన్నారు. సద్గురు శివానంద మూర్తి ఈవిషయం స్పష్టంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు.
ప్రతి మనిషిలో హృదయ కమలంలో చిన్న సైజులో వారి వారి స్వరూపానికి అనుగుణంగా తేజో స్వరూపుడు ఉంటాడని , ఆ రూపాన్నే అంగుష్ఠ మాత్ర పురుషుడు అంటారని డాక్టర్ రాఘవేంద్రన్ చెప్పారు. అంగుష్ఠ మాత్ర పురుషుడు లో అతి చిన్న బిందువు తేజోరూపంగా ఉంటుందని, యోగ సాధన ద్వారా ఆ బిందువు చుట్టూ వున్న చీకటి లాంటి స్వరూపం తొలగిపోయి, సంపూర్ణ తేజోవంతంగా మారుతుందని ఆయన వివరించారు. గురువుని తలచుకుని ధ్యానం, ప్రాణాయామం చేస్తూ , యోగ సాధన చేయాలని ఆయన సూచించారు. ప్రతిరోజూ నిర్దేశిత సమయంలో తప్పనిసరిగా యోగ సాధన చేయాలన్నారు. వాస్తవానికి రోజుకి మూడు సార్లు చేస్తే, మంచిదని, ఒకవేళ రెండు సార్లు చేసి , మూడో సమయంలో అయ్యో చేయలేకపోతున్నానే అని తలచుకున్నా సరిపోతుందని ఆయన అన్నారు. గురువు లేకపోతే , ఒక్కోసారి జీవుడు బయటకు వచ్చి మళ్ళీ లోపలకు వెళ్ళే మార్గం తెలియక ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు వచ్చిన సందర్భాలు కూడా వున్నాయని సద్గురు శివానంద మూర్తి చెప్పేవారని డాక్టర్ రాఘవేంద్రన్ అన్నారు. ఒక చోట కూర్చుని గురు ధ్యానం చేసుకుంటే, ఎదురుగా అంగుష్ఠ పురుషుడు కూర్చుని ఉంటాడని అప్పుడు పని సులభ మవుతుందని అన్నారు. కనీసం నిద్రపోయే ముందు యోగ సాధన చేస్తూ, నిద్ర పొతే నిద్ర సాగే సమయమంతా యోగ సాధన చేసేనట్లే నని సూచించారు. డాక్టర్ కేసాప్రగడ సత్యనారాయణ , వాడ్రేవు మల్లపరాజు దంపతులు, వాడ్రేవు వేణు గోపాలరావు దంపతులు , ఫణి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.