సార్ధక బిరుదాంకితులు పండిత యశస్వి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి

150వ జయంతి సభలో ఆచార్య బేతవోలు కైమోడ్పు 
   ‘శ్రీ  శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కి  గండపెండేరం సత్కారం, గజారోహణం ఇలా ఎన్నో సత్కారాలు జరిగాయి.  ఎన్నో బిరుదులూ వున్నాయి. ఆ బిరుదులన్నీ సార్ధక బిరుదులే. శతాధిక గ్రంధాలను రాసిన శ్రీపాద వారు కృతి కర్తె కాదు. కృతి భర్తగా కూడా. ప్రజ్ఞా వంతుడు. ప్రతిభావంతుడు. యశస్వి. శ్రీపాద వారి తర్వాత అంతటి కీర్తి ప్రతిష్టలు పొందిన వాళ్ళు లేరు. అసలు హర్షుడు రాసిన నైషధీయ చరితాన్ని, శ్రీనాధుడు రాసిన శృంగార నైషధాన్ని మళ్ళీ రాయాలని తలచడానికి ఎన్నో దమ్ములుండాలి. అది శ్రీపాద వారికే చెల్లింది’ అని హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం ఆచార్య బేతవోలు రామబ్రహం అన్నారు. మహామహోపాధ్యాయ , కళా ప్రపూర్ణ , కవిరాజు , కవిసార్వభౌమ , కవిబ్రహ్మ,  ఆంధ్రప్రదేశ్  తొలి  ఆస్థానకవి   శ్రీపాద  కృష్ణమూర్తి  శాస్త్రి సార్ధ శత జయంత్యుత్సవం (150ఏళ్ళ వేడుక) ఆశ్వియుజ  బహుళ  షష్టి  శుక్రవారం సాయంత్రం  త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ఆధ్వర్యాన నిర్వహించారు.  శ్రీపాద వారి ప్రపౌత్రుడు శ్రీ  కల్లూరి శ్రీరామ్, శ్రీమతి విజయలక్ష్మి దంపతుల సారధ్యంలో  గోదావరి గట్టునగల సమితి మినీ ఆడిటోరియంలో  ఆత్మీయ పూరిత వాతావరణంలో జరిగిన  ఈ కార్యక్రమానికి  సూర్య సాయంకాలం పత్రిక సంపాదకులు శ్రీ   వి ఎస్ ఎస్ కృష్ణకుమార్ స్వాగతం పలికారు. ఆచార్య బేతవోలు రామబ్రహం అధ్యక్షత వహిస్తూ, గొప్ప గొప్ప వాళ్ళ గురించి వారి వారి కుమారులు పట్టించుకోకపోయినా మనవలు పట్టించుకోవడం అభినందనీయమని అన్నారు. బాపట్లకు చెందిన కొమాండూరి కృష్ణమాచార్యులు రాసిన  శ్రీకృష్ణ లీలామృత ప్రబంధానికి వారి మనుమని కోరిక మేరకు వ్యాఖ్యానం తాను రాస్తున్నానని ఈ సందర్బంగా ఆచార్య బేతవోలు ప్రస్తావించారు.  
పదబంధ నేర్పరి శ్రీపాద వారు …   
   మహామహోపాధ్యాయ శ్రీ  విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ  శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఒంటిచేత్తో రామాయణ,మహాభారత, భాగవతాలను అనువదించడమే కాక శతాధిక గ్రంధాలను రాసారని,  పద్యం , గద్యం, లలితపదాలు అన్నీ ఆయన రచనలో స్పష్టంగా కనిపిస్తాయని  అన్నారు. స్మార్తం, వేదం, శ్రవుతమ్ ఈ మూడు నేర్చుకున్న గొప్ప పాండిత్యం గల శ్రీపాద వారు ఆయన తండ్రి నిర్వహించిన యజ్ఞానికి ఆధ్వర్యం వహించారని వివరించారు. హర్షుడు రాసిన నైషధం , శ్రీనాధుడు రాసిన శృంగార నైషధం లకు ఏమాత్రం తగ్గకుండా అద్భుత వర్ణనలతో శ్రీపాద వారు నైషధాన్ని రాసారని విశ్లేషించారు. స్వర్గీయ బుగ్గా పాపయ్య శాస్త్రి ప్రతియేటా శ్రీపాద వారి జయంతి,టినగర్ లక్ష్మి నరసింహ స్కూల్ లో  జరిపేవారని ఆ సమయంలోనే ఓసారి మల్లంపల్లి శరభేశ్వర శర్మ  నేతృత్వంలో  సంస్కృత నాటక సప్తాహం ఆ వేదిక మీద జరిగిందని శ్రీ గోపాలకృష్ణ శాస్త్రి గుర్తుచేశారు. ఇంటికి వచ్చిన వాళ్ళు చివరకు కోర్టు కేసులు వేసినవాళ్లు వచ్చినా సరే ఆతిధ్యం ఇచ్చి అన్నం పెట్టడం ఆయనలోని గొప్పతనమని చెప్పారు. గోదావరి తీరం,రాజమహేంద్రవరం తాలూకు ప్రశస్తిని చాటిన శ్రీపాద వారు తన రచనలో ఎన్నో కొత్త పదాలు వాడడమే కాదు, ఒకపదం వేస్తే అర్ధం ఎలా మారుతుంది, ఓ పదం తీసేస్తే అర్ధం ఎలా ఉంటుంది వంటి ప్రయోగాలు చేసారని విశ్లేషించారు. ‘మరందం, మకరందం … ‘వంటి పదాలను ఆయన ప్రస్తావించారు. సజాతి,విజాతి ,విలోమ పదాలతో పదబంధం చేసిన నేర్పరి శ్రీపాద వారని శ్రీ గోపాలకృష్ణ శాస్త్రి అన్నారు. శివదండకం, సరస్వతి దండకం ఇలా దండకాలను కూడా పొదిగారని చెప్పారు. ముఖ్యంగా వసంత  రాత్ర వర్ణన, దమయంతి వర్ణన అమోఘమని ఆయన చెప్పారు.  అయితే ఎక్కడా కూడా మూల గ్రంధాల సహజత్వం పోకుండా చూసారని అన్నారు.  మున్సిపల్ మ్యూజియం లో గల శ్రీపాద వారి విగ్రహాన్ని సముచిత స్థానంలో పెట్టాలని ఆయన కోరారు. 
శ్రీపాద వారి రచనా పటిమ అమోఘం ….
      ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి మాట్లాడుతూ శ్రీపాద వారు రాసిన నైషద చరితం చూసి, అసలు ఎందుకు రాసారని అనుకున్నానని, తీరా చదవగా శ్రీపాద వారే రాయగలరని అనిపించిందని చెప్పారు. నిజానికి శ్రీపాద వారు అనువాదం చేయలేదని, అనుసృజనం చేసారని, అయితే మూలాన్ని ఎక్కడా విస్మిరించలేదని  అన్నారు. నైషధం లోని పద్యాలను రాగయుక్తంగా ఆలపిస్తూ, వివరించారు. నైషధం పుస్తకానికి డాక్టర్ ధూళిపాళ వ్యాఖ్యానం రాసి, పునర్మ్దుద్రిస్తే బాగుంటుందని ఆచార్య బేతవోలు సూచించారు. 
  సంస్కృత భాషోద్యమ సారధి ఆచార్య  దోర్బల ప్రభాకర శర్మ మాట్లాడుతూ శ్రీపాదను  అభినవ పోతన గా అభివర్ణించారు. ఈసందర్బంగా  కల్లూరి శ్రీరామ్ రూపొందించిన శ్రీపాద వారి ప్రత్యేక సంచికను ఆచార్య బేతవోలు ఆవిష్కరించారు. శ్రీపాద వారి శతజయంతి రాజమహేంద్రవరం, హైదరాబాద్ లలో నిర్వహించిన విషయాన్ని శ్రీ   పోతుకూచి సూర్యనారాయణ మూర్తి గుర్తుచేశారు. 
  కామారెడ్డి నుంచి వచ్చి  కొవ్వూరు ఆంద్ర గీర్వాణ విదాపీఠంలో నెలకు 15రోజులపాటు వ్యాకరణం ఉచితంగా బోధించి వెళ్తున్న  86ఏళ్ళశ్రీ  అమరేశం రాజేశ్వర శర్మ ఈ సందర్బంగా శ్రీపాదవారితో గల అనుబంధాన్ని వివరించారు. 1947నుంచి 1951మధ్య కాలంలో  ప్రతి శని ఆదివారాల్లో ఆయనతో గడిపే అవకాశం కలిగిందన్నారు. మహాకావ్యాలే కాదు చిన్న చిన్న పుస్తకాలు కూడా రాసారని, ఏదైనా అధ్యాయం పూర్తిగా చదివి వెంటనే అనువాదం చేసేవారని గుర్తుచేసుకున్నారు.  శ్రీ  చేబియ్యం  వెంకట్రామయ్య మాట్లాడుతూ శ్రీపాద వారి ఆశీస్సులతో త్యాగరాజ సమితి వర్థిల్లుతోందని, అందుచేత ఆయన పేరిట ఓ కచేరీ ఏర్పాటుచేయాలని సూచించారు. నఖ చిత్రకారుడు డాక్టర్ రవి పరస  గోటితో వేసిన శ్రీపాద వారి చిత్రపటాన్ని ఆచార్య బేతవోలు ఆవిష్కరించి,  కల్లూరి శ్రీరామ్ కి అందించారు.
     శ్రీ కల్లూరి శ్రీరామ్ మాట్లాడుతూ తన తండ్రి 1996వరకూ రాజమహేంద్రవరం వచ్చి, శ్రీపాద వారి జయంతి నిర్వహించేవారని ఇప్పుడు 150వ జయంతి నిర్వహించే అదృష్టం తనకు దక్కిందని అన్నారు. 29న విశాఖ లో నిర్వహిస్తామని చెప్పారు. శ్రీపాద వారికి వచ్చిన పతకాలు, వస్తువులు ఆంద్ర యూనివర్సిటీకి ఇచ్చేశారని, అయితే అందులో కొన్ని మ్యూజియంకి తరలించారని, కొన్ని ఇంకా ఎక్కడ ఉంచారో వెతుకుతున్నామని అంటున్నారని అయితే ఉన్నవాటిని  29న ప్రదర్శించడానికి అంగీకరించారని వివరించారు.  అలాగే తన తండ్రి శ్రీ కల్లూరి సూర్య  సత్యనారాయణ మూర్తి శతజయంతి మరో 15రోజుల్లో జరగబోతోందని ఆయన చెబుతూ, తండ్రి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. 
  శతావధాని డాక్టర్ అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు శ్రీపాద వారిపై పద్యం వినిపించారు. ఈసందర్బంగా కల్లూరి శ్రీరామ్ నేతృత్వంలో  అతిధులను, వక్తలను   మాజీ ఎం ఎల్ ఏ శ్రీ  రౌతు సూర్యప్రకాశరావు, ఆదాయపు పన్ను శాఖ అధికారి శ్రీ  రామావతారం, శ్రీ  వంకలంక రామం, శ్రీ అశోక కుమార్ జైన్ తదితరులు  సత్కరించి, మెమొంటోలు అందించారు. శ్రీ రామేన బ్రహ్మంను కూడా సత్కరించారు. సర్వశ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ,చాగంటి శరత్ బాబు, పెరుమాళ్ళ రఘునాధ్,అశోక కుమార్ జైన్,ఓ ఎన్ జిసి రిటైర్డ్ అధికారి శ్రీ విజయకుమార్, శ్రీపాద జిత్ మోహన్ మిత్ర, డాక్టర్ తల్లావఝల పతంజలి శాస్త్రి, ఎర్రాప్రగడ ప్రసాద్, నల్లగొండ రవిప్రకాష్, జోరా శర్మ, డాక్టర్ పివి మురళీకృష్ణ,జూపూడి వెంకట రమణారావు,కల్లూరి శ్రీరాములు,నిమ్మలపూడి వీర్రాజు,డాక్టర్ కెవి రమణమూర్తి దంపతులు,డాక్టర్ పీఎస్ రవికుమార్,గ్రంధి రామచంద్రరావు,పెమ్మరాజు గోపాలకృష్ణ,దినవహి బాపిరాజు, మరాశాస్త్రి,  డాక్టర్ ఏ ఎస్ వి మహాలక్ష్మి, బులుసు వెంకటేశ్వర్లు,సత్యమూర్తి,అజ్జరపు హరిబాబు, ప్రజాపత్రిక సుదర్శన్, దీక్షితుల సుబ్రహమణ్యం,వాడ్రేవు దివాకర్, తదితరులు పాల్గొన్నారు.  అలాగే ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం యూట్యూబ్ లో  లైవ్ టెలికాస్ట్ చేసిన ఈస్ట్ న్యూస్ రామనారాయణ్ ని కూడా నిర్వాహకుల పక్షాన ఆచార్య బేతవోలు సత్కరించారు. 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.