DR(Major) Challa Satyavani’s krishna pushkara darshini

ఆధ్యాత్మిక సంపద వితరణ చేస్తున్న డాక్టర్ చల్లా సత్యవాణి ..
    ఆధ్యాత్మికంగా తాను అనుభూతి పొందుతూ,  పదిమందికీ ఆ  అనుభూతిని అందించడానికి, పుస్తక రూపం కల్పించి, ఆధ్యాత్మిక సంపదను వితరణ చేస్తూ తన జీవితాన్ని డాక్టర్ చల్లా సత్యవాణి సార్ధకం చేసుకున్నారు.. ఇంకా చేసుకుంటున్నారు. ఓ పుస్తకం వేయడమే చాలా కష్టం. అలాంటిది అంత్యంత నాణ్యతతో, అరుదైన ఫోటోలు సేకరించి మరీ, పుస్తకాల మీద  పుస్తకాలు వేయడం ఆషామాషీ కాదు. పైగా ఎవరి సాయం లేకుండా  తన సొంత ధనం వెచ్చించి, ఆధ్యాత్మిక సంపదగా మర్చి,  పదుగురికే పంచడం ఆమెకే చెల్లింది. ఈవిధంగా  పుణ్యాన్ని  పదిమందికీ పంచుతున్నారని ప్రశంసించని వారు లేరు.  గడిచిన 16 ఏళ్లుగా ఈ యజ్ఞం కొనసాగిస్తున్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడ ఆలయాలను దర్శించి, వాటి విశిష్టత అవగతం చేసుకోవడంతో పాటూ, అక్కడకు ఎలా వెళ్ళాలి వంటి విషయాలంటిని పొందు పరుస్తూ, వ్యాసాలను పత్రికలకు అందించి , వాటన్నింటినీ క్రోడీకరించి, పుస్తక రూపం తెచ్చి, ఉచితంగా పంచిపెట్టడం ఈమె సహజ లక్షణం. ఈ విధంగా ఇప్పటివరకూ ఈమె 23 పుస్తకాలు అందుబాటులోకి తెచ్చి, తాజాగా 24వ పుస్తకంగా  ‘కృష్ణానది పరీవాహక క్షేత్రాలు – దేవాలయాలు (కృష్ణవేణి పుష్కర దర్శిని) పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆగస్టు 20న కృష్ణాతీరం ‘హంసల దీవి శ్రీ వేణుగోపాలుని సన్నిధిలో’ ఈ పుస్తకాలకు పూజ చేయించి వచ్చారు. ఆగస్టు 21న తన నివాసంలో ఆవిష్కరణ వేడుక నిర్వహించారు.

 పరిచయం ….

 కౌండిన్యస గోత్రికులు శ్రీమతి చల్లా అచ్యుత రామలక్ష్మి, శ్రీ వీరావధానులు పుణ్య దంపతులకు 1942 ఏప్రియల్ 4న అంటే చిత్రభాను సంవత్సర చైత్ర బహుళ తదియ శనివారం రాజోలు తాలూకా  మలికిపురం మండలం మోరి గ్రామంలో డాక్టర్ చల్లా సత్యవాణి జన్మించారు. 1942 మే నెల  నుంచి ఈమె దానవాయిపేట ఇంటి నెంబర్ 46- 18-11లోనే నివసిస్తున్నారు. ఈ ఇంటి పేరే ప్రణవ కుటి.
  డాక్టర్ (మేజర్) సత్యవాణి   ఎం ఏ(హిందీ) సాహిత్య రత్న, ఎం ఏ రాజనీతి శాస్త్రం, ఎం ఏ (ఫిలాసఫీ), ఎంఇడి, ఎం ఫిల్, పిహెచ్ డి  పూర్తిచేశారు. శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలలో లెక్షరర్ గా పనిచేసిన ఈమె ఎన్ సిసి ఆఫీసరు గా , ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా సేవలందించారు. ఎంతోమంది విద్యార్థినులకు స్ఫూర్తినిచ్చారు. పదవీ విరమణ చేసాక, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టి, కళాశాల అభివృద్ధికి బాటలు వేశారు. ప్రస్తుతం డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
 నిష్కళంక దేశభక్తుడు, నిస్వార్ధ నాయకుడు , మాజీ మంత్రి  డాక్టర్ ఎబి నాగేశ్వర రావు – రాజకీయ జీవితంపై పరిశోధన చేసి ఎం ఫిల్ సాధించారు. శ్రీమతి విజయలక్ష్మి పండిట్ – రాజకీయ జీవనంపై పరిశోధనకు డాక్టరేట్ పొందారు. 2006లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ‘సర్ రఘుపతి వెంకట రత్నం నాయుడు’ స్వర్ణ పతక పురస్కారం అందుకున్న డాక్టర్ సత్యవాణి, మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి నుంచి అన్నపూర్ణయ్య పురస్కారం పొందారు. ఎన్నో సత్కారాలు అందుకున్నారు.
  ‘కృష్ణ వేణి పుష్కర క్షేత్ర దర్శిని’ ఆవిష్కరణ 
 డాక్టర్ చల్లా సత్యవాణి కృషి కి పలువురు ప్రశంస 
pustakam
   డాక్టర్ చల్లా సత్యవాణి విరచిత  ‘కృష్ణానది పరీవాహక క్షేత్రాలు – దేవాలయాలు’ శీర్షికన ‘కృష్ణవేణి పుష్కర దర్శిని’ పుస్తకాన్ని సాహితీ సర్వజ్ఞ శ్రీ పోతుకూచి సూర్యనారాయణ మూర్తి ఆదివారం ఉదయం ఆవిష్కరించారు. దానవాయిపేటలోని ‘ప్రణవ కుటీర్’ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డాక్టర్ సత్యవాణి స్వాగతం పలికారు. కృష్ణానది పుష్కరాల సందర్బంగా అందరికీ ఉపయుక్తంగా ఉండేలా అన్ని విషయాలతో సమగ్ర వివరణతో పుస్తకం తేవడం అభినందనీయమని శ్రీ పోతుకూచి అన్నారు. సృజనాత్మకత పుష్కలంగా వున్న డాక్టర్ సత్యవాణి ఎన్నో పుస్తకాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా రూపొందించారని ప్రశంసించారు. డాక్టర్ టి జయప్రద పుస్తక సమీక్ష చేస్తూ, ఆధ్యాత్మిక , చారిత్రక , సాంస్కృతిక, విషయాలను పొందుపరిచిన  పుస్తకంగా  ‘కృష్ణానది పరీవాహక క్షేత్రాలు – దేవాలయాలు’ ను అభివర్ణించారు. 24 పుస్తకాలు రచించిన డాక్టర్ సత్యవాణి రెండు పుస్తకాలు మినహా అన్నీ ఆధాత్మిక పుస్తకాలేనని వివరించారు. ఈ పుస్తకం చదువుతుంటే కృష్ణా తీరంలోని క్షేత్రాలను దర్శించిన అనుభూతి కలిగిందన్నారు. 
 శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి లలితా భారతి అతిధిగా పాల్గొంటూ, ఇలాంటి మంచి పుస్తకాలు మరిన్ని రాయాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ పీఎస్ ప్రకాశరావు మాట్లాడుతూ డాక్టర్ సత్యవాణి సత్ సంకల్పం వలన ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడే పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.  కళా గౌతమీ వ్యవస్థాపకులు డాక్టర్ బివిఎస్ మూర్తి మాట్లాడుతూ, పూర్వ జన్మ సుకృతం వల్లనే మానవ జన్మ వస్తుందని, అటువంటి మానవ జన్మను సార్ధకం చేసుకునే విధంగా డాక్టర్ సత్యవాణి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక రచనలతో తరిస్తూ , మనందరినీ తరింపజేస్తున్నారని పేర్కొన్నారు. 
 సూర్య సాయంకాలం పత్రిక సంపాదకులు శ్రీ వి ఎస్ ఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ, వృద్దులంటే జ్ఞాన వృద్ధి చెందిన వారని, దీన్ని నిజం చేస్తూ వృద్ధాప్యంలో ఎలా ఆనందంగా ఉండవచ్చో డాక్టర్ సత్యవాణి సిస్టర్స్ నిరూపిస్తున్నారని అన్నారు. హానుమాన్ జంక్షన్ దాటితే, ఏమౌతుందోనని భయపడే మన ప్రాంత వాస్తులను ఎక్కడో చార్ ధామ్ యాత్ర చేసి వచ్చేలా డాక్టర్ సత్యవాణి స్ఫూర్తి  నిచ్చారని పేర్కొన్నారు. పంచారామ యాత్ర దర్శిని, నవజనార్ధన ఆలయ దర్శిని పేరిట ఆర్ టి సి ప్రత్యేక సర్వీసులు నడపడానికి కూడా డాక్టర్ సత్యవాణి పుస్తకాలే కారణమన్నారు. ఆమధ్య  డాక్టర్ సత్యవాణి కాలుకి ఇబ్బంది వచ్చి, బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చినా సరే, పుస్తకాల రచన సాగించిన విషయాన్ని శ్రీ కృష్ణకుమార్ ప్రస్తావిస్తూ,హెచ్ జి వెల్స్ ఏక్సిడెంట్ తో మంచాన పడ్డాక కూడా రచనలు చేసాడని అన్నారు. జపాన్ లో రిటైరయ్యాక రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని అన్నారు. వారందరినీ అధిగమిస్తూ, డాక్టర్ సత్యవాణి తన ఆధ్యాత్మిక యజ్ఞం సాగిస్తున్నారని అన్నారు.  పెన్షనర్స్ అసోసియేషన్  నాయకులు శ్రీ జగన్నాధరావు, తెలుగువెలుగు డాక్టర్ అరిపిరాల నారాయణరావు , చల్లా సోమయాజులు , డాక్టర్ చల్లా సరస్వతి తదితరులు పాల్గొన్నారు.   
challa satyavani
 ముద్రిత గ్రంధాలు ….
డాక్టర్ (మేజర్) సత్యవాణి రచించిన గ్రంధాల్లో దాదాపు అన్ని ముద్రితమయ్యాయి. 1. సత్యవ్యాస కదంబం ప్రధమ భాగం (30.4.2000). 2. డాక్టర్ ఎబి నాగేశ్వర రావు – ఏ పొలిటికల్ స్టడీ (1.11.2001). 3. ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్ర దర్శిని(4.3.2003). 4. మా ఊరి గుళ్ళు – తరలివచ్చిన దేవుళ్ళు (గోదావరి పుష్కర దర్శిని, ఆగస్టు 2003). 5. త్రిలింగ క్షేత్ర దర్శిని (ఫిబ్రవరి 2004), 6. నవ జనార్ధన క్షేత్ర దర్శిని(ఆగస్టు 2004). 7. ఎన్ సి సి – ఏ సింబల్ ఆఫ్ డిసిప్లిన్ తొలిభాగం (4.3.2005). 8. పంచారామ క్షేత్ర దర్శిని (మార్చి 2005). 9. సత్యవ్యాస కదంబం రెండవ భాగం (ఏప్రియల్ 2006). 10. ద్వాదశ నారసింహ క్షేత్ర దర్శిని (23.8.2008). 11. రాజమహేంద్రిలో ఒకనాటి నాయకత్రయం (1.11.2008). 12. పంచాయతన దేవాలయములు – తూర్పు గోదావరి జిల్లా (3.11..2008). 13. శ్రీ పర్వత వర్ధినీ ఉమా రామలింగేశ్వర పంచాయతన ఆలయం – శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ల క్షేత్ర మహ్యత్యం (11.11.2008). 14. ఎన్ సిసి  – ఏ సింబల్ ఆఫ్ డిసిప్లిన్ రెండవ భాగం (నవంబర్ 2008). 15. అష్ట సోమేశ్వర క్షేత్ర దర్శిని – తూర్పు గోదావరి జిల్లా ప్రధమ ముద్రణ (23.2.2009). 16. మహిళా రత్నం, పద్మ విభూషణ్ డాక్టర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ (15.7.2009). 17. హిమాలయ క్షేత్ర దర్శిని (28.3.2010). 18. అష్టమూర్తి శివ క్షేత్ర దర్శిని (4.4.2011). 19. రాజమహేంద్రవర వర పుత్రుడు , శతాబ్ది మహనీయుడు డాక్టర్ ఎబి నాగేశ్వరరావు(14.2.2012). 20. నాలు దిక్కులా నాలుగు క్షేత్రాలు (23.3.2012). 21. అష్ట సోమేశ్వర క్షేత్ర దర్శిని – తూర్పు గోదావరి జిల్లా రెండవ ముద్రణ (10.3.2013). 22.తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర యాత్రాదర్శిని(15.4.2015). 23.గోదావరి పరీవాహక క్షేత్రాలు – దేవాలయాలు (గోదావరి పుష్కర క్షేత్ర దర్శిని – 14.7.2015). 24.   ‘కృష్ణానది పరీవాహక క్షేత్రాలు – దేవాలయాలు’  (కృష్ణవేణి పుష్కర దర్శిని – ఆగస్టు 2016).  
సమీక్ష …
krishna harati
    డాక్టర్ చల్లా సత్యవాణి విరచిత ‘కృష్ణానది పరీవాహక క్షేత్రాలు – దేవాలయాలు'(కృష్ణవేణి పుష్కర దర్శిని) 128 పేజీలతో అందంగా ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. కృష్ణమ్మబొమ్మ – హారతి సమర్పించే అద్భుత ఘట్టాన్ని కవర్ పేజీపై ముద్రించారు. గోదారమ్మకు హారతి , గడిచిన పుష్కరాలలో టిటిడి నమూనా ఆలయం , మిగిలిన క్షేత్రాల నమూనాల చిత్రాలు, ప్రస్తుతం కృష్ణా పుష్కరాలలో కొలుదీరిన నమూనా ఆలయాలు, టిటిడి ఆలయం , విధ్యుత్ కాంతులతో కృష్ణమ్మ శోభ, మహిళా మణుల పుష్కర సందడి ఇలా కలర్ ఫొటోలతో ఆకర్షణీయంగా పుస్తకాన్ని  మలిచారు. కృష్ణా తీరాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుంది ఈ పుస్తకం చదివితే ..
   కృష్ణా జిల్లాలో కాకుండా కృష్ణా నదీతీరంలో అలరారుతున్న ఆలయాల గురించి సమగ్రంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. డాక్టర్ (మేజర్) సత్యవాణి ఈ పుస్తకాన్ని ఆమె పెద్దక్కయ్య డాక్టర్ చల్లా సరస్వతి 80వ వసంతాల ప్రాయంలోకి అడుగిడిన శుభ సందర్బంగా ఈ పుస్తకరత్నాన్ని కానుకగా సమర్పించుకున్నారు. అమృత తుల్యులు , జననీ జనకులు స్వర్గీయ చల్లా అచ్యుత రామలక్ష్మి, స్వర్గీయ చల్లా వీరావధానులు చిత్రాలు ముద్రించారు. ఇక ఆమె చిన్నన్నయ్య  స్వర్గీయ చల్లా సుబ్రహ్మణ్య శాస్త్రి కి నమస్సు మాంజులులు సమర్పిస్తూ, ఫోటో ముద్రించుకున్నారు. గురువు గారికి నమస్సు మాంజులులు అంటూ జ్యోతిష విజ్ఞాన భాస్కర బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి ఫోటును ముద్రించారు. ఆత్మబంధువు , సమాచారమ్ దిన పత్రిక దివంగత  సంపాదకులు శ్రీ సుబ్రహ్మణ్యంకు అక్షరాంజలి సమర్పిస్తూ ఫోటో ముద్రించారు.
  కృష్ణ వేణీ నదీమ తల్లికి నమస్సు మాంజలులు సమర్పిస్తూ ఈ పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చిందో డాక్టర్ సత్యవాణి ‘నా మాట’ లో  వివరించారు.  పుష్కరం అంటే ఏమిటి , పుష్కర మెట్లు ఎలా ఏర్పడ్డాయి, కృష్ణా నదీ జననం, గమనం,పుష్కర ప్రాశస్త్యం, కృష్ణ పుష్కర వ్రతం, వ్రత విధానం, మహత్యం వంటివన్నీ వివరిస్తూ, మహారాష్ట్ర లోని మహా బలేశ్వర్ నుంచి హంసల దీవి వరకూ  కృష్ణా తీరం వెంబడి గల దేవాలయాల చరిత్ర – ప్రాశస్త్యం, అక్కడ చేసే కార్యక్రమాలు అన్నింటిని సమగ్రంగా  వివరించారు ఈ పుస్తకంలో ..
 డిటిపి అండ్ డిజైన్: శ్రీ ముద్రిక గ్రాఫిక్స్ , శ్రీ ఎం వి రామ్ కుమార్.
 గ్రంథ ముద్రణ : గణేష్ ప్రింటర్స్ 
 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.