Fire Accident in RMC

నగర పాలక సంస్థ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం
కొన్ని రికార్డులు దగ్ధం – విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే కారణమా!

corporetion fire acident (1)corporetion fire acident (5)corporetion fire acident (3)corporetion fire acident (4)corporetion fire acident (2)
ఓపక్క నూతన భవనంలో సేవల్ని అందించేందుకు సిద్ధమవుతున్న రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయంలో మరోపక్క పాత భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సరైన కారణం తెలియకున్నా, ఇలా జరగడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. భవనం పురాతం అయినందున విద్యుత్‌ లైన్లు అన్నీ కూడా పాతవి కావడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారుల విశ్లేషణ. నగరపాలక సంస్ధ చరిత్రలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించిందని అంటున్నారు. కమిషనర్‌ చాంబర్‌ కింద భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లో దట్టమైన నల్లని పొగ వ్యాపించడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక దళాధికారులు హుటాహుటిన నగర పాలక సంస్ధ కార్యాలయానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. అరగంట తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో కంప్యూటర్లు, ఫర్నిచర్‌, భవనం లోపల సీలింగ్‌ మంటల్లో ఆహుతయ్యాయి. చాలా వరకూ ఫైల్సు కూడా కాలిపోగా కొన్ని ఫైళ్ళు పాక్షికంగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి పైపుల ద్వారా నీళ్ళను వెదజల్లడంతో సగం కాలిన ఫైళ్ళన్నీ పూర్తిగా తడిసిపోయాయి. నగర పాలక సంస్ధ అధికారులు సిబ్బంది అక్కడకు వచ్చి కాలిపోయిన, తడిసిపోయిన ఫైళ్ళను కౌన్సిల్‌ సమావేశం హాలులోకి తరలించారు. పలువురు ప్రజాప్రతినిధులు వచ్చి పరిశీలించారు.
రికార్డులు భద్రమే నంటున్న కమిషనర్‌
నగర పాలక సంస్ధ కార్యాలయంలో అగ్నిప్రమాదం విషయాన్ని తెలుకున్న మున్సిపల్‌ కమీషనర్‌ శ్రీ విజయరామరాజు సంఘటనా స్ధలానికి చేరుకుని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రమాదంలో కాలిపోయి.. తడిసి పోయిన ఫైళ్ళను కౌన్సిల్‌ హాలుకు తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్‌ షార్టు సర్య్కూట్‌ వల్ల ప్రమాదం జరిగిందన్నారు. కంప్యూటర్‌లు, ఫర్నీచర్‌ దగ్ధమయ్యాయన్నారు. కార్యాలయానికి సంబంధించిన సమాచారం అంతా భద్రంగానే ఉందన్నారు. ఆస్తి నష్టం సుమారు 5 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. మేయర్ శ్రీమతి పంతం రజనీ శేషసాయి సంఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు.
పెద్దగా ప్రమాదం ఏమీ లేదన్న ఎం.ఎల్‌.సి ఆదిరెడ్డి
నగర పాలక సంస్ధ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించిందని సమాచారం తెలుసుకున్న ఎంఎల్‌ సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికార్డులు అన్నీ భద్రంగా ఉన్నాయని.. కంప్యూటర్లు, ఫర్నీచర్‌ ప్రమాదంలో దగ్దమైందన్నారు.
ప్రజాప్రతినిధుల వాగ్వాదం
కాగా నగర పాలక సంస్ధ కార్యాలయం ఆవరణలో అగ్నిప్రమాదం సంభవించడంతో విషయం తెలుసుకున్న ఎంఎల్‌ సి ఆదిరెడ్డి అప్పారావు అక్కడకు వచ్చారు. భవనం లోపలకు వెళ్ళి కాలిపోయిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. అదే సమయంలో అక్కడకు వైఎస్‌ ఆర్‌ సిపి నగరపాలక సంస్ధ ప్లోర్‌ లీడర్‌ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి, కార్పోరేటర్లు మింది నాగేంద్ర, ఈతకోట బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం వచ్చారు. ఫైళ్ళన్నీ కాలిపోయాయని వైఎస్‌ఆర్‌ సిపి బృందం చర్చించుకుంటోంది. దీనిపై ఎం.ఎల్‌.సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురికి స్వల్పవాగ్వాదం చోటు చేసుకుంది. కాగా ఎం.ఎల్‌.సి అనుచితంగా వ్యవహరిస్తున్నారని శ్రీమతి షర్మిలారెడ్డి ఆరోపించారు. నగర పాలక సంస్ధలో ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఇదేమిటని ప్రశ్నించిన వారిపై ఇలా దురుసుగా వ్యవహరించడం తగదన్నారు. అసలు ఈ ప్రమాదం గురించి వాస్తవాలేమిటో వెల్లడించాలన్నారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.