Sangeetha Geyadhara by V.B. Saikrishna Yachendra

సంగీత సాహిత్య  మేళవింపుతో   అలరించిన  ‘గేయధార’
yachendra2yachendra
 సంగీతం వింటే చాలు మనకు సంగీత జ్ఞానం లేకపోయినా దాని  తాలూకు గానమాధుర్యం వెంటనే వీనుల విందు చేస్తుంది. మనసుకు హాయిని గొల్పుతుంది. అదే సాహిత్యం అయితే భావసౌందర్యం నెమ్మదిగా అర్ధమవుతుంది. అర్ధమయ్యే కొద్దీ లోతుపాతులు తెలుస్తాయి. నిజానికి సంగీత, సాహిత్యాలు రెండూ అమ్మవారి క్షీర ధారాలని అంటారు. సాధారణంగా సంగీతం , సాహిత్యం విడి విడిగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కానీ  ప్రసంగతరంగిణి ఆధ్వర్యంలో ఈ రెండూ జట్టుకట్టాయి. సాధారణంగా ప్రతినెలా సాహిత్య ప్రసంగంతో అలరించే ఈ సంస్థ ఈసారి సంగీతాన్ని కూడా జోడించింది. ఇందుకు సంస్థ అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ బిక్కిన రామమనోహర్ ప్రధాన భూమిక వహించారు. కారణం ఆయన తండ్రి స్వర్గీయ బిక్కిన సత్యనారాయణ మూర్తి 25వ వర్ధంతి. శ్రీ సత్యనారాయణ మూర్తి గారు కోనసీమ  రాజోలు సమీపంలోని ఓ గ్రామంలో సాహిత్య స్రవంతి పేరిట సాహిత్య కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇక డాక్టర్ రామ మనోహర్ సారధ్యం వహిస్తున్న ప్రసంగ తరంగిణి కూడా సాహిత్య కార్యక్రామాలు చేస్తోంది. అంతేకాదు ఈలపాటలో డాక్టర్ రామ మనోహర్ ఆరితేరారు. అందుకే ఇటు సాహిత్యం, అటు సంగీతం మేళవించి, ఆయన తండ్రి సంస్మరణగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం ఆద్యంతం అలరించింది. మార్చి 11  శనివారం రాత్రి రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర  ఆనం కళాకేంద్రంలో వెంకటగిరి రాజా,  ‘సంగీతసాహిత్య సరస్వతి’ డాక్టర్‌ వి.బి.సాయికృష్ణ యాచేంద్ర నిర్వహించిన వినూత్న ప్రక్రియ ‘సంగీతగేయధార’ సంగీత రసజ్ఞులను, సాహిత్యమర్మజ్ఞులను ఏకకాలంలో మెప్పించింది. డాక్టర్‌ టి.శరత్‌చంద్ర ఘంటల స్వరఝరి,డాక్టర్ యాచేంద్ర సంగీత గేయధార, జిత్ మోహన్ మిత్రా, డాక్టర్‌ టి.శరత్‌చంద్ర, డాక్టర్ బిక్కిన రామమనోహర్ ల గీతాలాపన ఇలా మూడు విభాగాలుగా సాగిన ఈకార్యక్రమానికి  డాక్టర్‌ ప్రభల సుబ్రహ్మణ్యశర్మ అధ్యక్షత వహిస్తూ,   సంగీత సాహిత్యాలు రెంటికీ వేద మే మూలమన్నారు. సాహిత్యానికి సంబందించినంతవరకు వేదసారం రామాయణంగా అవతరించిందని, సామవేదమంతా సంగీతసారమన్నారు.
     పృచ్ఛకులు తమ తమ అంశాలు ప్రస్తావిస్తే,  ప్రముఖ శాస్త్రీయసంగీత విద్వాంసుడు తిరుపతి త్యాగరాజు  నిర్దేశించిన రాగంలో డాక్టర్  యాచేంద్ర అవలీలగా  గేయాలను వినిపించారు.  ఆయా రాగాలకు చెందిన  ఘంటసాల గీతాలను డాక్టర్‌ టి.శరత్‌చంద్ర మధ్యమధ్యలో ఆలపిస్తూ రక్తి కట్టించారు.  శతావధాని డాక్టర్‌ అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు ‘పద’ నిషేధం విధిస్తూ, సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం మహిళాభ్యున్నతికి చేసిన కృషిపై గేయం వినిపించాలని కోరగా, శ్రీ త్యాగరాజు కళ్యాణి రాగం నిర్దేశించగా, డాక్టర్ యాచేంద్ర గేయం ఆలపించి కరతాళ ధ్వనులందుకున్నారు.  ’ సంస్కృతాంధ్ర విద్వాంసురాలు డాక్టర్‌ ప్రభల శ్రీవల్లి‘ పల్లవి పూరణం ఇస్తూ ‘కరువు జయించును చెరువు,సిరి వెలయించును తరువు (చెట్టు)’ అని చెప్పి చరణం కట్టమన్నారు. భీమ పరాశ రాగంలో కట్టాలని శ్రీ త్యాగరాజు సూచించారు. దీంతో ‘జలమే కదా ఇలలో జీవాధారము, వృక్షమే కదా రక్షణ కవచము’ అంటూ గేయధార చేసారు.   గేయకవి మహమ్మద్‌ ఖాదర్‌ఖాన్ ‘మంచి ముచ్చట్లు’ (అవధాన ప్రక్రియలో అప్రస్తుత ప్రసంగంలాంటిది ) అంశం చేపడుతూ, ఇక్కడ పాడిన ఘంటసాల పాటలో ‘నీ ఆనతి లేకున్న విడలేను’ అనే అందమైన అబద్ధం వుంది. మీరు కూడా ఓ అబద్ధం చెప్పండి అని అడగ్గా,’నేను బాగా పాడగలను’అని  డాక్టర్ యాచేంద్ర అంటూ ఇదికూడా అబద్ధమే కదా అని చమత్కరించారు.
    శ్రీమతి  పంకజలక్ష్మి ‘వర్ణన’ గురించి ప్రస్తావిస్తూ, స్వర్గ ధామమయిన అమరావతి గురించి వర్ణించమన్నారు. ఉదయ చంద్రిక రాగంలో పాడాలని శ్రీ త్యాగరాజు నిర్దేశించారు. ఆంధ్రులకు రాజధాని అమరావతి, సిరులొలికే భరతమాతకు సిగవల్లి, తెలుగువారి తలలు పండి వెలసినదీ, ఎందరో కర్షకుల సుందర స్వప్నమిది,కృషీవలుల త్యాగ సంపదతో ఆకృతి దాల్చినది, కృత నిశ్చయమున సాగిపొమ్మని , గతినే చూసినది, సద్గతిని చూసినది, అదే అదే అమరావతి, ఆంధ్రుల కలల సాకృతి , ఇదే అభినవ అమరావతి’ అంటూ డాక్టర్ యాచేంద్ర చేసిన గేయధారకు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. 
 నీలోత్పలకవి యార్లగడ్డ మోహనరావు ‘ఇష్టపద ప్రయోగం’ చేస్తూ, ఓంకారం లోంచి జనక రాగాలు వచ్చాయని అంటారు కదా. అందులో భైరవి రాగంలో ఓ గేయం వినిపించాలని కోరగా,’సింధు భైరవి పాడనా, నా పులకింత, సుందర భావనలే నాలో అందరించగ, గణించగ, తరించగ,స్ఫురించగ’ అంటూ గేయధార చేసారు.  
   ముందుగా   ప్రసంగతరంగిణి పక్షాన  ‘సంగీత సాహిత్య కళాభిజ్ఞ’ బిరుదంతో డాక్టర్  యాచేంద్రను డాక్టర్ రామమనోహర్ దంపతులుసత్కరించారు. ప్రసంగ తరంగిణి కార్యదర్శి శ్రీ బత్తుల సాయిబాబు స్వాగతం  పలుకగా, డాక్టర్ యాచేంద్రను డాక్టర్ కాలనాధభట్ల సత్యనారాయణమూర్తి పరిచయం చేసారు. శ్రీ సవితాల సుబ్రహ్మణ్యం సన్మాన పత్రం చదివి వినిపించారు. పృచ్ఛకులను  ప్రసంగతరంగిణి పక్షాన సత్కరించారు. అలాగే వైలెన్ చంద్ర మౌళి, మృదంగం శ్రీనివాస్,తబలా రమేష్,సౌండ్ ఇంజనీర్ బుజ్జి లను కూడా జ్ఞాపికలతో సత్కరించారు.  డాక్టర్‌ టి.శరత్‌చంద్ర, పలువురు ఔత్సాహిక గాయకులు ఘంటసాల పాటలను వినిపించారు. నటుడు, గాయకుడు జిత్‌ మోహన్  మిత్రా మాయాబజార్ లోని భళి భళి పాటతో  అలరించారు. డాక్టర్‌ బిక్కిన రామమనోహర్‌ దాదాపు 25ఘంటసాల పాటలను క్లుప్తంగా  ఈలపాటతో  వినిపించారు. శ్రీ మురళి , పోలీసు సత్యనారాయణ తదితరులు ఘంటసాల పాటలను ఆలపించారు. కుమారి భవ్య,శ్రీమతి రమ్య,శ్రీమతి కళ్యాణి, అనుష్క, తదితరులు గీతాలు ఆలపించారు. సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీకి చెందిన శ్రీ కొప్పర్తి రామకృష్ణ, సర్వశ్రీ ఎస్ బి చౌదరి,డాక్టర్ బివిఎస్ మూర్తి,డాక్టర్ తేతలి వెంకటేశ్వరరావు, రామినీడి మురళీ,దినవహి వెంకట హనుమంత్రరావు దంపతులు, అల్లు బాబీ, కానూరి నాగేశ్వరరావు, ఆనంద్,ముత్యాల చౌదరి,తదితరులు పాల్గొన్నారు.
geyadhara

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.